Friday, August 21, 2020

కల్కి అవతారం!

భయం ధరిత్రికి 
బహుమతి ఇచ్చి
బతుకు బండికి 
బంధనం వేసిన
మహా విషాద సందర్భం

నగరాలకి ఉరి వేసి 
నాగరికతకి పాతరేసి
నరుడి మనుగడని 
నరకప్రాయం చేసిన 
మహోజ్వల సంక్షోభం

ఎల్లలు ఎరగని కల్లోలం 
ఎటు చూసినా విలాపం
దేశం గీశం వివక్ష లేని
ద్రోహపు క్రిమి విధ్వంసం

చైనాలో వూహాన్ నగరం
ఇటలీలో మిలన్ సిటీ
ఇరాన్‌లో టెహ్రాన్ దుఃఖం
ఫ్రెంచ్ వీధుల క్రౌంచ బాధలు

ఎవరిని కదిపిన విషాదమే
ఎక్కడ చూసిన విలోమమే
మానవాళికి నివాళి పట్టే
మాయల పొరల జావళి

నేనెంత అన్నదే 
నీకు మిగిలిన సందేహం
నీవింతే అన్నది 
నీకు మిగిల్చిన సందేశం

గర్వం హరించి 
సర్వం నశించి
నింగి హర్మ్యాలని 
నేలకి దింపిన మరో రాకడ!

నాదే అన్నది నాశం
నేనే అన్నది వినాశం
ఇది ప్రకృతి చెప్పిన సత్యం
దారి తప్పితే చావు తథ్యం

రోగం రాసిన రాగంలో 
బతుకు ఆగమాగం
అణువు, రేణువులోనే 
అంతా పరిపూర్ణం

జలచరమై, ఉభయచరమై
వరాహమై, ఉగ్ర సింహమై
వామనం నుంచి విమాన
స్వరూపమైన అవతార రహస్యం

సూక్ష్మం నుంచే అకాల మోక్షం
చివరికి మిగిలేది శూన్యంలోనే
కంటికి ఆనని కదలికలోనే 
విశ్వరూప సాక్షాత్కారం

కరోనా కాదిది 
కల్కి అవతారం
ధర్మసంస్థాపనే ఏమో కానీ
యుగ సంస్కరణ ఖాయం!
                -కేశవ్
(మనిషి మూర్ఖపు చేష్టలే వందేళ్లకోసారి విరుచుకుపడే విపత్తులు... భూమిపై కోట్లాది జీవుల్లో తనూ ఒకడని మరచినవాడికి ప్రకృతి చెప్పిన గుణపాఠమే కరోనా క్రిమి... భారతీయ పురాణాల ప్రకారం పెరిగిన పాపాన్ని పరిహరించేందుకు  తొమ్మిది అవతారాలు ఎత్తిన మహావిష్ణువు దశమ అవతారం ఇదేనేమో!)

“Corona is not a virus, but avatar for the protection of poor creatures. they have come to give the message of death and punishment to the one who eats them,” said Swami Chakrapani, the National President of All India Hindu Mahasabha.


0 comments: