Sunday, September 24, 2017

నీ... కు!

పొగ తాగేస్తే ప్రేమ పొదుగు
చిక్కినట్టేనా...
చావేజేమైనా చే గెవారాని
మించినోడా...
చుస్తే చూస్తం.. లేకపోతే లె...
ఆర్ట్స్ కాలేజీ గేటు ముందు
ఉచ్చ పోస్తే నీకేంది
ఉరేసుకుంటే నీకేంది

కళ్ళకి నెత్తుటి చారిక
వేళ్ళకి పరీక్ష నాళిక
కాళ్ళకి గుర్రపు నాడా
గుండెకి పాబ్లో నెరూడాని
తగిలించాలని చూస్తే, ఊరుకోం
***        ***      ***

బే... అంటావు
బేవకుఫ్ అంటావు
బేషరం, తిడతావెందుకు
తీట తీరేవరకు పడుకోనివ్వక

మాకళ్ళకి ఐటెక్స్ కాటుక
మావేళ్ళకి రెవ్లాన్ నాళిక
మాకాళ్ళకి బాటా బిరడా
మాగుండెకి నీరో గురుడూ
వేళ్ళాడితే నీకు ప్రాబ్లమేంటి?

రిప్ వాన్ వింకిల్ లేచినప్పుడు
రింకిల్స్ లేని ప్యాంటు ఉందా
జిమ్మీ జెట్ టీవీ సెట్ గా మారిపోతే
జిమ్మీ మమ్మీ ఏంచేసిందో రాయి...

ముల్లుకర్ర పట్టుకొని
ములుకు కొడవళ్ళు పెట్టుకొని
మా వెంట పడతావెందుకు
జాగ్ నే కీ రాత్ ఖతం హోగయీ
సోనే దో భాయ్... సోనే దో

                          నీ... కవిత్వాన్ని నిరసిస్తూ...
                                     -కేశవ్

Friday, September 1, 2017

పరతంత్రం


యుద్ధం నాది
గాయం నాది
గెలుపు వేరొకరిది

పేర్చిన బతుకు నాది
రాల్చిన చెమట నాది
ఫలితం వేరొకరిది

మోసే భుజం నాది
చేసే కవాతు నాది
విజయపతాక వేరొకరిది

                       -కేశవ్Thursday, August 24, 2017

Hope

Saturday, August 19, 2017

చినుకు మొక్క!

వాన మంచిదే కానీ 
వద్దన్న చోటే పడుతుంది ఎందుకు?
పుట్టడమే గొప్ప అనుకున్న చోట
పుట్టుకతో చావు జతకట్టిన చోట
బతికినా చచ్చినట్టే కనిపిస్తోంది ఎందుకు?

చావుకి కొలమానం రాలిపోవడం
రోజూ రాలే ఆకుల లెక్క
ఆయువు కొలిచే కాలమితి
చెట్టుకి చచ్చిపోవడం తెలుసు
బతికి బట్టకడ్డడం తెలుసు
ఒక్క చుక్క నీటితో జీవం పోసుకొని
పచ్చని పరికిణీలు అల్లుకోవడం తెలుసు
నీటి చుక్కల నేతిమూటల్లో
జీవపు పరిమళాల్ని అద్దుకోవడం తెలుసు
మహోజ్వల జీవి మనిషి మాత్రం ముగింపులో
ఉషోదయాన్ని చూడలేకపోతున్నాడు ఎందుకు?
మరణాన్ని అమృతం చేయాలంటే
మట్టి పొత్తిళ్లలో చినుకు మొక్కలు నాటాల్సిందే
                           -కేశవ్

Thursday, May 11, 2017

లోహపు ముల్లుపిచ్చివాడా
అతుకుల బొంతలు
గతుకుల దారులు
చూసిన తర్వాత కూడా
ప్రేమలోతుల్ని కొలవాలంటావా...

అవసరాలు పరిచిన
సున్నిత తెరల్లో
లోహపు ముళ్లు దాచి
కసిదీరా గుచ్చిన తర్వాత కూడా
వెతుకులాట ఆపవా...

నిజాలు కావాలంటే
నీ గుండెలోతుల్ని కొలిచి చూడు
నిజాయితీ చూడాలంటే
నీ దేహపు పొరల్ని పొడిచి చూడు
ఎవడి బతుక్కి వాడే కొలమానం
ఎవడి నొప్పి వాడికే ప్రామాణికం
పక్కవాళ్ల లెక్కలు తీస్తే
మిగిలేది చిక్కులే!!!
                           -కేశవ్

Thursday, March 2, 2017

బతుకు ‘చితి’కి...వదులుకుంటే తిరిగి తెచ్చుకోవచ్చు 
పోగొట్టుకుంటే వెదికి పట్టుకోవచ్చు 
పారేసుకుంటే ఎవరైనా తెచ్చి ఇవ్వొచ్చు 
పగలగొట్టుకుంటే, మిగిలేది ముక్కలే! 

నిలబెట్టుకోవాలనే జ్ఞానం ఉన్నప్పుడు 
పగలగొట్టుకునేదాకా తెచ్చుకోకూడదు 
బతుకైనా, అతుకైనా ఒక్కటే కదా 
జారిందా దొరకదు... చితికిందా అతకదు!!
                           -కేశవ్

Friday, December 30, 2016

ద్వైతం!

నీ హృదయంలో కట్టిన సమాధి
నీ నవ్వు పూసిన  ద్రోహపు కత్తి
నాకొద్దు!

నీ ప్రేమలో దాగిన విషపు కౌగిలి
నీ చూపులో దాచిన మైకపు మత్తు
నాకొద్దు!

నీ చేతులతో పేర్చిన మోహపు చితీ
నీ మాటలతో పేనిన వలపు ఉరీ
నాకొద్దు!

నీ మనసు రాసిన విద్వేష నైషధం
నీకు తెలిసి ఆడిన కపట నాటకం
నాకొద్దు!
                           -కేశవ్