Monday, April 12, 2021

వి’ప్లవ’ గీతం!

ఏం రాశావురా పైవాడా...
ఇచ్చినట్టే ఇచ్చి అన్నీ లాగేసుకున్నావ్
గెలిచానో ఓడానో తెలీని అయోమయంలో
బతుకు లెక్కలు వేసుకుంటే... 
అన్నీ బకాయిలు, భరించలేని బాధలు మిగిల్చావ్...

ఒక్కోసారి... 
నీకు నచ్చితే 
కత్తి పదునెంతో గొంతుపై చూస్తావు...
గమ్మత్తైన తాడు పేని కాళ్లకి ఉరేసి ఓపికని పరీక్షిస్తావ్

వెధవలు, సన్నాసులు, పైలా పచ్చీస్ గాళ్లు, 
పచ్చి నెత్తురు తాగే పుండాకోరులు
టిక్ టాక్ గా బతికేస్తుంటే..
సెల్ఫీ లైఫ్ లో తమాషాలు కురిపిస్తుంటే
నిజాయితీ నిక్కరు తొడుక్కొని
నిఖార్సైన అత్తరు రాసుకొని
అన్ని బురదలు దాటి వస్తే... 
చివరకు మిగిలేది 
జిడ్డు తేలిన జిందగీ 
జీతం లేని జీవితం
జీవం లేని జీవనం
ఏం తమాషా రా నీది...

ఇప్పుడు శానిటైజ్ చేయాల్సింది
నిన్నా... మా నమ్మకాన్నా
బాధలు దాచేస్తూ మాస్కులు వేసుకున్నాం...
కన్నీళ్లు తోడేస్తూ కిట్లు ధరించాం
రుచి, వాసన తెలీని లోకంలో
ఊగి రాలిపోతున్నాం
అయినా నీ ఆట నీదే కానీ
వేట ఆపవా...

చూడు
ఈ నిమిషం నీదే పై చేయి, కానీ 
ఎన్ని అవతారాలు చూడలేదు
లెక్కలు సరి చేసేందుకు
ఇవాళ వస్తావు రేపు పోతావు
మిగతా అన్ని రోజులు మళ్లీ మావే

-కేశవ్
(శార్వరికి సమాధి కట్టే సంబరంలో...)

0 comments: