చరిత్రని రాయాలనే తపన
ధరిత్రిని మలచాలనే దార్శినికత
ఒకరిస్తే వచ్చేది కాదు
రాజేస్తే రగులుకునేది కాదు
అది సహజాతం
గుండె గుహల్లో
రగిలే దావానలం
మనసు మహల్లో
విరిసే పారిజాతం
బతుకు అంచులు దాటేందుకు
పోరాడుతుంది సముద్రం
లోకం ఎత్తులు తాకేందుకు
తలపడుతుంది పర్వతం
రాయికి తెలీదు
రత్నాన్నవుతానని
శిలకి తెలీదు
శిల్పాన్ని అవుతానని
బతకడం చేతకాని వాడికి
భయమే భరోసా
బతుకే భారమైన వాడికి
విశ్వాసమే దిలాసా
చావు మనది అయినప్పుడు
బతుకు కూడా మనది కావాలి
మనది కాని బతుకులో
మనం బతకడమంటేనే నరకం
మరణం ఒకేసారి వస్తుంది
అస్తిత్వపు మరణం
అంచలంచెలుగా వస్తుంది
తోకచుక్కలు పుట్టి రాలిపోతాయి
ఉన్నంతసేపూ వెలుగుల తోరణాలు అల్లుతాయి
తోటి మనుషులు రాళ్లు వేసిపోతారు
రాలిపోయిన తర్వాత వెలుగు దీపాలు అద్దుతారు
ఎవరెస్టు ఎక్కినవాడికి
దిగిపోవడం పతనం కాదు
అధిరోహణలో లక్ష్యం ఉంది
అవరోహించినంత మాత్రాన
అపజయం పాలైనట్టు కాదు
ప్రతి ఓటమీ మరణం కాదు
అసలు మరణమేం ఓటమి కాదు
ఆఖరి ఆశ తెరిచే కొత్త ద్వారం
ఓటమి నుంచి గెలుపుకి
నడవడం పునర్జన్మ
ప్రతిభని, ప్రతిష్టని, జీవన ప్రగతిని
పరోపకార శక్తినీ చంపడమే
అస్తిత్వ మరణమైతే...
అచెంచల ఆత్మవిశ్వాసం ముందు
అది తలవంచక మానదు
ఇది ఒకనాటి చరిత్ర...
ఇక నడిచేదంతా చరిత్రే...
-కేశవ్
0 comments:
Post a Comment