Tuesday, April 30, 2019

ఒంటరి చెట్టు

చినుకు రేణువులకి
జల్లెడ పట్టే గొడుగువవుతావు

వేడిగాడ్పుల మింటికి
సతత హరిత చరణమవుతావు

శీతగాలుల పీడకి
ఎదురు నిలిచే గోడవవుతావు

రెక్కలు విసిరే పక్షులకు
వెచ్చని గూళ్ల నిచ్చనవవుతావు

ఆడిపాడ వచ్చే బుజ్జాయిలకి
ఆనంద డోలికల ఊయలవవుతావు

ఆకలి మంటల తంటలకు
అందివచ్చే పండువవుతావు

పండగల వేళ పసందైన పందిరివి
కొంటె పిల్లల కొమ్మచ్చుల పల్లకీవి
పెద్దమనుషుల చర్చల రచ్చబండవి
పేరంటాళ్లు కొలచవచ్చే అమ్మలబొమ్మవి
మాపటేళ అమ్మలక్కల ముచ్చట్ల అరుగువి

కవిత్వ ఝంఝా మారుతానికి తెల్లని కాగితానివి
పంచభక్ష్యాలు తీర్చిపెట్టే పచ్చని విస్తరాకువి
ఎండివాడితే చిటపట మంటల వంట చెరకువి
ఉలి మొనల కాచే మేలిమలుపుల పడక్కుర్చీవి
కడవరకు మోసి, కాటికి సాగనంపే అసలు కాపరివి

ఎందరికి ఎన్ని చేసినా...
చివరికి ఎందుకు ఒంటరివవుతావు!!!
                                             -కేశవ్

0 comments: