Friday, November 25, 2016

మూడు ముక్కలు!

నీ కౌగిలిలో కరిగిపోవాలని
కలలతీరం చేరుకోవాలని
ప్రతి అణువూ తపించింది
ఎన్ని అడుగులు వేశానో
ఎంత దూరం తిరిగానో
నాకు మాత్రమే తెలుసు
ఎక్కడ మొదలు పెట్టానో
అక్కడికే తీసుకొచ్చావు
హాట్సాఫ్...

అడగకుండా ఇచ్చిన వరాలు
అడిగినా పట్టించుకోని వైనాలు
మనమధ్య ఎన్ని ఉన్నా
మళ్లీ మళ్లీ కలిపేదే బంధం
చితి నుంచి చిగుళ్లు వేయడం సాధ్యమా
గాలిలో దీపంలా వదిలేసిన క్షణాలు
గాలి మాత్రమే తిని బతికిన నిమిషాలు
అన్నిటినీ లెక్కకట్టి నాకే అప్పజెప్పావు
థాంక్స్...

ద్వేషం లేక్కించలేని లోతుకి
ద్రోహపు కత్తి దిగుతుందా
ప్రేమం వికసించాల్సిన చోట
ఊహకందని విద్వేషం ఉంటుందా
పాషాణ సావాసంలో మిగిలేది ప్రవాసమే
పాత జ్ఞాపకాల మొండి ముళ్లు
గుచ్చుకుంటుంటే ఓ క్షణమైనా
వెనక్కి తిరుగుతాననుకున్నావు కదూ
నమ్మి నేర్చుకున్న పాఠాలు,
చెరిపి రాసుకున్న గుణపాఠాలు
మర్చిపోయి, మళ్లీ దిద్దుకోవాలా
నెవర్...

-కేశవ్

2 comments:

Gopal Rao.P said...

చాలా చాలా బాగుంది సర్.....బహుశా మీరు ఈ వ్యధను అనుభవించుంటారు కాబోలు ... పదజాలంలో మీ బాధ తెలుస్తుంది..ద్వేషం లెక్కించలేని లోతుకి
ద్రోహపు కత్తి దిగుతుందా..నమ్మి నేర్చుకున్న పాఠాలు,
చెరిపి రాసుకున్న గుణపాఠాలు .... ఎంత గొప్ప పదాలు సర్ అది మీరు వాడిన తీరు హ్యాట్సాఫ్..


చివరగా ఓ మాట సర్..గాలి మాత్రమే తిని బతికిన నిమిషాలు కాకుండా గాలిని మాత్రమే పీల్చి బతికిన నిమిషాలు అని ఉంటే మీ కవిత్వానికి మరింత అందమైన భావం వచ్చుండేదని నా అభిప్రాయం సర్...మీకు చెప్పేంత గొప్పవాడిని కాదు సర్ ...ఇది నా అభిప్రాయం మాత్రమే...

keshav said...

గాలి పీల్చడం వెరీ కామన్, గాలిని తిని బతకడం అనేది చాలా క్లిష్టం... అంటే అంత భారమైన భావన ఉంది 😊