Sunday, August 14, 2016

సప్తతి స్తుతి!

ఓ దేశమాతా...
ఆకలిని గెలిచే చిట్కా చెప్పు
ఆత్మీయతని కత్తిరించే నాభి చూపు 
అనుబంధాల సంకెళ్లని తొలగించు
అర్థంలేని భావోద్వేగ హననం నేర్పించు

ఎవడికి వాడు ఓటమికి రాసే సెంటిమెంట్లు వద్దు
నారెక్కలకు సామ్రాజ్యవాద ఉక్కుని తొడుగు
నానాలుకకు భాషలకి అంటని నేర్పుని ఇవ్వు
నామనసుకి ఇనుప కచ్చడాల్ని అద్దడం నేర్పు

కాళ్లు కన్వర్టర్లుగా 
కళ్లు స్కానర్లుగా
మెదడుని మెమరీ చిప్ గా
గుండెని హైస్పీడ్ మోటార్ గా
నా దేహమే రోదసియానం చేసే క్యాప్సూల్ గా మార్చు

గతం జెండా  మోయలేను
తాతల నేతి వాసన వద్దు... 
నాకు నేనుగా చెప్పాలని ఉంది
ప్రపంచాన్ని గెలవాలని ఉంది
నా అస్తిత్వపు చినుకుని ఆకాశంపైకి విసరాలని ఉంది
నాకిప్పుడు దేశాలు ఎరుగని జాతీయత కావాలి...
ఎవడు ఎదురైనా మోక్కే గెలుపుబావుటా కావాలి...
-కేశవ్
(70యేళ్ల భారత స్వాతంత్ర్యోత్సవాల సందర్భంగా...)

0 comments: