Monday, March 23, 2015

శోక గీతం

ఎవరికి తెలీదు
ఎల్లలు ఎరుగని
మన మమతానురాగం

ఎవరికి తెలీదు
ఏళ్ల దోసిళ్లలో పెనవేసుకున్న 
మన అనుబంధం 

ఎవరికి తెలీదు
ఏరాడ గుట్టల్లో 
రాసుకున్న మరో చరిత్రలు

చరిత్రపుటల్ని తీసి 
మన ప్రేమగాధని 
లెక్కరాసుకుంటే 
అదొక మధురకావ్యం

చల్లని సాయంత్రాల్లో
నీ అధరాల ముద్రల్ని 
ఇసుక తెన్నెల్లో రాసి 
చెరిపేసిన క్షణాలు

తెన్నేటి ఉద్యానంలో
విరహ పరిష్వంగ జాడలు
భీమిలి వొంపులో కవ్వింపుగా
దాచుకున్న నీ సొంపులు
ప్రతిదీ ఒక ప్రేమ పుస్తకమే 
***     ***    *** 
హద్దులెరుగని ముద్దులు
హృద్యంగా మదిని తాకుతుంటే 
అంతులేని అనురాగబంధంతో 
అంతరాల్ని చెరిపేశావనుకున్నా

పాల నురుగుల పాశం వేసి
కౌగిలింతలతో పెనవేసుకుపోతే
వలపుతీరంలో వదిలిపెట్టని 
సరాగాల్ని సంధించావనుకున్నా

నీ బాహుబంధం ఓ దృతరాష్ట్ర కౌగిలి
నీ ఆత్మీయస్పర్శ భస్మాసురహస్తం
ఆలింగనంతోనే అంతానాశనం చేసే 
నీ దుష్టపరిష్వంగం ఇంత వికృతమా

మత్తువదిలి మనసు విదిల్చిన క్షణం
హుద్ హుద్ గద్దలు తాకిన క్షణం
మనం ప్రేయసీ ప్రియులం కాదు
నేనో నగరం... నువ్వో సాగరం...

                            -కేశవ్

0 comments: