Wednesday, September 17, 2014

అంతర్యుద్ధం

 







నాలోనే ఉంటూ
నాకు తెలియని 
నువ్వు ఎవరు

నిన్ను ప్రశ్నిస్తే
నా ఉనికి ఎందుకు
ప్రశ్నార్థకం

నిన్ను నిందిస్తే
నా మనసుకి
ఎందుకు గాయం
***  ***   ***

నిప్పుని కప్పేస్తే
నిజాలకు ముసుగులేస్తే
అబద్ధాలైపోతాయా

నిజయితీని కొనలేరు
నిజ నిరూపణలో
నియమాల్ని మార్చలేరు

ఆత్మలకు అసలు
ప్రశ్నించే హక్కే లేదు
ధిక్కరించే మార్గం అంతకన్నా లేదు
***   ***   ***

ఎవర్నీ వినకు 
విన్నా నమ్మకు
నమ్మినా పాటించకు

నమ్మకానికి హామీపత్రాలు
బజార్లో దొరకవు
బజారు మనుషుల దగ్గర ఉండవు

నిలువుటద్దాల దారుల్లో
నిజాల్ని వెతుక్కోమంటే
భుజాలు తడుముకోవడం ఎందుకు
***   ***   ***

నాలాగ ఉండగలిగితే ఉండు
లేదంటే నీదారి నువ్వు చూస్కో
నా ప్రయాణం నాకు నచ్చినట్టే

అంతరంగమే ఎదురు తిరిగినప్పుడు
అంతర్యుద్ధమే తప్పనప్పుడు
అర్థంతరంగానైనా ఆపేస్తా

నాకు నేను నియంతను
నా తలరాతకు విధాతను
నా నిర్ణయానికి ఓడినా, విజేతనే

                               -కేశవ్

0 comments: