Sunday, November 17, 2013

‘మాస్టర్’ పీస్!

ఆటే జీవితం అయినవాడు
ఆటని వదిలేయడం కష్టమే...

ఆటలోనే ఆయువు నింపుకున్నవాణ్ని
ఆపేయమంటే ఊపిరాపడమే...
ఇరవై రెండు గజాల పిచ్ లో
ఇరవైనాలుగేళ్లు కాపురం...
హఠాత్తుగా ఖాళీ చేయమంటే భారమే

నువ్వు నడుస్తుంటే
జాతీయ జెండా ఎగిరినంత గౌరవం
నువ్వు ఆడుతుంటే
జనగణమన పాడుతున్నంత గర్వం
ఆట కంటే ఎత్తు ఎదిగిన
ఆటగాడు ఎవరంటే, నువ్వే...
అతిశయోక్తి అనుకున్నా
అనలేక ఉండలేని మన:స్థితి

డబ్ల్యూజీ గ్రేస్, డాన్ బ్రాడ్ మన్
గురించి విన్నాం.. చదువుకున్నాం
కపిల్ తెచ్చిన కప్పు కథ
అప్పుడే కళ్లు తెరిపించింది

ఆటలో ఇంజినీరింగ్ చేసి
పట్టా పుచ్చుకున్నవాడంటే
నిన్ను చూశాకే తెల్సింది

ఎదిగినంతగా ఒదిగిన వ్యక్తిత్వం
పడినంతనే ఎగసిపడే స్వభావం
బహుశా మండే భాస్వరంలోనో
నిశ్శబ్ద అణ్వస్త్రంలోనో చూస్తుంటాం...
నీ ఆటలోనూ నీ మాటలోనూ
మైదానం బయటా లోపలా
నీ నడతలోనూ నడవడికలోనూ
అదే తీరు అదే జోరు...
జంటిల్మెన్ గేమ్ కి
పర్ఫెక్ట్ పర్యాయపదం...
ఆటలో హుందాతనానికి
అసలైన అర్థం నువ్వేనేమో

థాంక్యూ సచిన్
నీ యుగంలో క్రికెట్ చూసినందుకు
థాంక్యూ సచిన్
నీ శకంలో ఆటని ఆస్వాదించినందుకు

                                                 -కేశవ్

0 comments: