Thursday, November 12, 2015

సీమంతం


సిగ్గులేని జాతి ఇది
ప్రశ్నించే హక్కుందా
దిక్కుమాలిన జనానికి
దిశ మార్చే శక్తుందా

సీమ శోకం చూస్తె
చీమైనా కుట్టదు
కుమ్ములాట కుళ్లులో
ఇసుమైనా మారదు

కన్నీళ్లతో బతుకుల్ని
కలకాలం గడిపేద్దాం
కలిసి రాని నేతలతో
జీవితాల్ని కాలరాద్దాం

ముదనష్టపు మూర్ఖులే
మనగద్దెక్కిన పెద్దలా
మారని తలరాతలకు
మంచిగంధం చితులా

తెలుగు తెలుగు తెలుగంటే
తీరని దిగులేనా
భాష మీద మోజుంటే
భావమంత దాస్యమేనా

మాట ఒకటి మనదైనా
మనసంతా మసకేనా
జాతి ఒకటి అనుకుంటే
జగమంతా వేరేనా

తెలంగాణ, సీమగానం
కళింగాంధ్ర శషబిషలు
కలహాలతో కలకాలం
కలసుంటే మిగులు దు:ఖం

వీడు పోతే వాడు
వాడు పోతే వీడు
ఎవడో ఒకడి మీద
ఏడుపే ఎదగడమా

పాలకులు మీరే
బాధితులు మీరే
ఎన్నాళ్లీ బరువు మాట
ఎన్నేళ్లీ పొరుగు పాట

బళ్లారిని వదులేస్తే
బతుకు తెల్లారలేదా
తెలంగాణ తప్పుకుంటే
 వేరు పోరు చల్లారలేదా 

తల్లైతే ఒకతె గానీ
ఎన్నిసార్లు ఈ సీమంతం
తెలుగు నేల తోలు
బొమ్మాలాటకు లేదా అంతం
-కేశవ్

0 comments: