చిన్నప్పుడు చందమామ కథలు ఎక్కువగా చదివే అలవాటు… కల్పనలు, ఊహాశక్తితో పఠనాసక్తికి అది బీజం వేసింది... కొంచెం ఎదిగిన తర్వాత పుస్తక పఠనానికి ఇదే నాంది పలికింది… సాహిత్యంలో బాగా నచ్చేవి కవిత్వం, జీవిత చరిత్రలు… మనిషి సామాజిక వికాసానికి ఇదొక మంచి వ్యసనం… అలా చదివే రోజుల్లో బాగా ఆకట్టుకున్న జీవిత చరిత్రల్లో రెండు పుస్తకాలు ఎప్పటికీ వెంటాడేవి…
మొదటి పుస్తకం… ఫ్లేమ్స్ ఆఫ్ చినార్ (Flames of Chinar)
ఇప్పటితరానికి తెలిసిన ఒమర్ అబ్దుల్లా తాత… నిన్నటి తరం నాయకుడు ఫరూక్ అబ్దుల్లా తండ్రి… షేక్ అబ్దుల్లా జీవిత చరిత్ర అది. ఆ తరంలో ఆయన కశ్మీర్ కేసరి… భారత కాంగ్రెస్ రాజకీయాల్లో నెహ్రూ కుటుంబ వారసత్వం లెక్క ఎలా ఉందో… కశ్మీర్ రాజకీయాల్లో ఈ కుటుంబం పాత్ర కూడా అలాంటిదే…
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో కశ్మీర్ చరిత్రని, సంస్కృతిని తెలుసుకోవాలంటే ఫ్లేమ్స్ ఆఫ్ చినార్ చదవాల్సిందే… చినార్ అనేది కశ్మీర్ కే ప్రత్యేకమైన వృక్షం. కశ్మీర్ సంస్కృతికి ప్రతీక. షేక్ అబ్దుల్లా వ్యక్తిగత భావజాలాన్ని మినహాయించి చూస్తే… భారత్ లో జమ్ముకశ్మీర్ విలీనానికి ముందు ఆతర్వాత జరిగిన పరిణామాల్ని ఈ రచన ద్వారా అర్థం చేసుకోవచ్చు.
కశ్మీర్ లోయలో పెరిగిపోయిన నిరుద్యోగం, రాజకీయ ప్రేరేపిత ఉన్మాదాల్ని పరిశీలనా శక్తితో ఆకళింపు చేసుకోవచ్చు. గొప్పనేతలుగా భారతీయులు భావించే మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి వారిపై కూడా విద్వేషాన్ని చిమ్మి భారత వ్యతిరేకతని నూరిపోసిన విధానాన్ని పసిగట్టవచ్చు…
ఇక రెండో పుస్తకం… మై ఫ్రోజెన్ టర్బులెన్స్ ఇన్ కశ్మీర్ (My Frozen Turbulence in Kashmir)
మాజీ ఐఏఎస్, ఒకప్పటి కశ్మీర్ గవర్నర్, తర్వాతి కాలంలో కేంద్ర మంత్రి జగ్మోహన్ ఆత్మకథ. కశ్మీర్లో ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యాలు అరాచకానికి దారి తీసిన పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్టు వివరించిన పుస్తకం… కశ్మీరీ పండిట్ల వ్యధాభరిత జీవితం గురించి, పనూన్ కశ్మీర్ ఉద్యమం గురించి మొదటిసారి పరిచయమైంది ఈ పుస్తకంతోనే… కశ్మీర్ గవర్నర్ గా తన వైఫల్యాల్ని కప్పిపుచ్చేందుకే ఈ పుస్తకం రాశారని నిందించిన వారూ ఉన్నారు. కానీ వ్యవస్థ విఫలమైనా విద్వేషాన్ని ఉగ్గుపాలతో రంగరించినా జరిగే ఉత్పాతాలకు అది తార్కాణం.
మొదటి పుస్తకం వదిలిన ప్రశ్నలకు రెండో పుస్తకం సమాధానం ఇస్తుంది. రెండో పుస్తకం లేవనెత్తిన అంశాలకు సమాధానం ఎప్పటికైనా దొరుకుతుందా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు అంటే... చరిత్ర మిగిల్చిన గాయాల్ని కాలం చెరిపినా, కొన్ని ప్రతీకలు మాత్రం వాటిని మన ముందుకి తీసుకొచ్చి నిలబెడతాయి. అవి నిద్రలోనూ మనల్ని వెంటాడే గాయాలుగానే కనబడతాయి. అలాంటిదే ద కశ్మీర్ ఫైల్స్.
కశ్మీర్ చరిత్రలో 1947-50 మధ్య కాలం ఎంతటి కల్లోల సమయమో... 1980-90 అంతకు మించినది. సరిహద్దు ఘర్షణలు ఎలా ఉన్నా సగటు కశ్మీరీ జీవితాన్నిప్రభావితం చేసింది ఈ రెండోదశ ఉద్రిక్తతలే. కశ్మీర్లో తీవ్రవాద మూకల దురాగతాలు అప్పట్లో పతాక శీర్షికలే. మళ్లీ ఆనాటి సంఘటనల్ని ఈ తరం కళ్లముందుకి తీసుకొచ్చింది కశ్మీర్ ఫైల్స్. దాదాపు లక్షన్నరమంది కశ్మీర్ పండిట్లను లోయ నుంచి చెల్లాచెదురు చేసిన దుర్మార్గం వెనుక దాగి ఉన్న ఉన్మాదాన్ని ఈ చిత్రం ఆవిష్కరించింది. లెఫ్ట్ ఐడియాలజీకి సెల్యులాయిడ్ సమాధానంగా ఈ సినిమాని కొందరు అభివర్ణిస్తున్నారు. కానీ ఇది లెఫ్ట్, రైట్ కాదు, స్ట్రెయిట్ కశ్మీరీ ఫిలిం. ఈ సినిమాని మతం వైపు నుంచి కాదు, జన హితం వైపు నుంచి చూడాలి. జరిగిన దారుణాల్ని అంత ధైర్యంగా తెరపై ఆవిష్కరించడం ఓ సాహసమే. అదీ హైదరాబాద్ కి చెందిన నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఫిల్మ్స్ ఈ సాహసాన్ని చేయడం అభినందనీయం.
కశ్మీర్ ఫైల్స్ చూస్తున్నంత సేపు... సినిమా ప్రారంభంలోనే బియ్యం డ్రమ్ లో దాక్కున్న కశ్మీరీ పండిట్ ని తీవ్రవాదులు చంపే సన్నివేశం సినిమా చివరి వరకూ వెంటాడుతుంది... అప్పట్లో బీకే గంజూ అనే టెలికం ఇంజనీర్ ని, అతని కుటుంబాన్ని శ్రీనగర్ లో తీవ్రవాదులు హత్య చేసిన ఘటన ఇది... కశ్మీర్ ఉగ్రవాదుల క్రౌర్యాన్ని దేశం మొత్తానికి రుచి చూపించిన సందర్భం కూడా ఇదే.
కశ్మీర్ ఫైల్స్ కథపై ఎవరి అభ్యంతరాలు ఎలా ఉన్నా కొన్ని యధార్థ సంఘటనలకు అది దృశ్యరూపం. చరిత్ర పుస్తకాలు చదివే అలవాటు తగ్గిపోతున్న తరుణంలో ఇదొక హిస్టారికల్ విజువల్ బుక్. రెండు పుస్తకాలకు ఒకే చోట సమాధానం దొరికిందంటే రెండు పుస్తకాల సారాన్ని ప్రేక్షకుడు ఆకళింపు చేసుకున్నట్టే. కశ్మీర్ కి హామీ ఇచ్చిన గ్రేటర్ అటానమీని భారత రాజకీయ వ్యవస్థ తుంగలో తొక్కబట్టే సగటు కశ్మీరీలో అసంతృప్తి రాజుకుందనేది షేక్ అబ్దుల్లా మనోగతం. భారత్ లో అంతర్భాగమైనా ప్రత్యేక ప్రతిపత్తిని ఇవ్వడమే కశ్మీర్ లోయలో పండిట్ల ఊచకోతని నిలువరించలేక పోయాయనేది జగ్మోహన్ విశ్లేషణ. రాజకీయ చదరంగంలో కశ్మీరీ నేతలు వేసిన ఎత్తుల్ని రాష్ట్ర గవర్నర్ అయి ఉండి కూడా నిలువరించలేక పోవడానికి కారణమనే వేదన జగ్మోహన్ మాటల్లో ధ్వనిస్తుంది. వర్తమానంలో ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితే... కాశ్మీర్ లోయలో మళ్లీ చినార్ వృక్షాల ఆత్మీయ ఆహ్వానాలు, గుల్ మార్గ్ లో హిమ గిరుల శిఖర చుంబనాలు, శ్రీనగర్ దాల్ సరస్సులో షికారాలు, కశ్మీరీ సోయగాల మెత్తని తివాచీలతో ప్రపంచ పర్యాటకుల పాద స్పర్శ భూతల స్వర్గంలో సేద తీరినట్టే!
-కేశవ్
0 comments:
Post a Comment