Tuesday, December 21, 2021

కాలాపానీ నుంచి మరక్కార్ దాకా...


దేశానికి 50వ స్వాతంత్ర్య దినం... అంటే స్వర్ణోత్సవాల వేళ ‘కాలాపానీ’ అని ఒక సినిమా వచ్చింది... స్వాతంత్ర్యం కోసం నాటి దేశభక్తులు చిందించిన త్యాగం, ఈ దేశం చుట్టూ స్వేదం, రక్తం కలిసిన సముద్ర జలాలతో ఆవరించి ఉందని అనిపించింది. ఇప్పుడు ఆజాదీ అమృత ఘడియల్లో మరక్కార్ మన తలుపు తట్టింది. ఇది యాదృచ్ఛికం అయినా పాతికేళ్ల తర్వాత దర్శక దిగ్గజం ప్రియదర్శన్ సాకారం చేసుకున్న కల... అప్పట్లోనే మరక్కార్ కథపై ప్రయత్నాలు చేసినా బడ్జెట్, నిర్మాణ పరమైన అంశాలతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. 

మరక్కార్ ‌-మహాయోధుడు కుల్జాలి జీవిత కథ ఇది... దేశం మొత్తం ఆంగ్లేయుల అకృత్యాలతో నలిగిపోతుంటే మలబారు, కొంకణ తీరాలు మాత్రం పోర్చుగీసు, ఫ్రెంచ్ పిశాచాలతో పోరాడాయి. ఈదేశంపై అధికారం బలపడ్డాక ఆంగ్లేయులు వీరిని అతి కొద్ది ప్రాంతాలకే పరిమితం చేశారు కాబట్టి ఆ దాష్టికాలు 90 శాతం మంది భారతీయులకు తెలీనివి. కానీ మన భాష, ఉపమానాల్లో మాత్రం పోర్చుగీసులు బుడతకీచులుగా, ఫ్రెంచ్ దొరలు బూచీలుగా వచ్చి భయపెడుతూనే ఉంటారు. 

వాస్కో డా గామా, దేశం మొత్తానికి ఒక పోర్చుగీసు నావికుడు మాత్రమే. సుగంధ ద్రవ్యాల కేంద్రమైన మళయాళ సీమపై అధికారాన్ని సాధించడానికి గామా, గామాల వారసులు చేసిన దాష్టికాల పరంపరని ఈ గడ్డపై అడుగు పెట్టకుండా సమద్ర జలాల్లోనే నిలువరించిన మహావీరుడు కుల్జాలీ. నిరంకుశ రాజరికాన్ని ధిక్కరించి సముద్ర దొంగగా విదేశీయుల్ని వణికించిన మరక్కార్, దేశ రక్షణ కోసం నిలిచి రాజకీయాలకు బలైపోవడమే ఈ చిత్ర కథ. 

మరక్కార్ సాహసాల గురించి చరిత్రలో అనేక ఆధారాలు ఉన్నాయి. వాటిని తవ్వి తీసేందుకే ఏళ్లు పట్టింది. పాతికేళ్ల తర్వాత టెక్నాలజీ సాయంతో తన కలని సాకారం చేసుకున్నాడు ప్రియదర్శన్. ఓడలు, సముద్రాలు, కేరళ సీమని కూడా రామోజీ ఫిలిం సిటీలో సృష్టించారంటే నమ్మలేం.  అబద్దం, కల్పితం పాన్ ఇండియాగా పరుచుకుంటున్న వేళ, నిజం, నిజాయితీ ఆకట్టుకోవడం కొంచెం కష్టమే. వంద కోట్ల వ్యయంతో కరోనా కష్టాల్ని అధిగమించి డిసెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి వచ్చింది మరక్కార్. అంతే వేగంగా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది... 

వీలైతే మీరు, లేదంటే మీ పిల్లలకు తప్పకుండా చూపించండి... ఎందుకంటే పులులు, సింహాలు మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలు వదిలేస్తే... మిగిలినవి నక్కలు, తోడేళ్లు... అవే ఇప్పుడు రాజ్యం చేస్తున్నాయి... ఈ ‘అమృత’ ఘడియల్లో ఆ రహస్యాల్ని పిల్లలకి విప్పి చెప్పడం అవసరం!

0 comments: